మాటలతో మాయ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆనాటి జంధ్యాల తర్వాత అంతటి ప్రభావితం చూపడం ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ వలనే సాధ్యమైంది అని చెప్తే అతిశయోక్తి కాదేమో! అలాంటి త్రివిక్రమ్ ‘అ…ఆ…’ సక్సెస్ సంబరాలలో… తన సినిమా గురించి చెప్పుకోవడం కన్నా కూడా… ఈ రొటీన్ కాంపిటీషన్ జీవితంలో పడిపోయి మనిషి ఎలా మారిపోతున్నాడు…? అన్న సున్నితమైన అంశాన్ని ప్రతి ఒక్కరి మదికి తగిలేలా స్పష్టంగా చెప్పాడు త్రివిక్రమ్.
ఒక సింపుల్ కధను ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా, ఒక మనిషి సాధారణ జీవితంలో ఎదురయ్యే సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నించానని చెప్పిన త్రివిక్రమ్… “మనిషి కలలు, ఆశయాలు, ఆలోచనలు గొప్పవైతే ముందుకు తీసుకెళ్తాయి, అవే చెడ్డవైతే వెనక్కి పడేస్తాయి. ఇవాళ మనిషి ఫోన్ చూస్తూ పక్క వాళ్ళకి హలో చెప్తున్నాడు, టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాడు, రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ, నాన్నలతో మాట్లాడకుండా ఇష్టమొచ్చిన ఛానల్ పెట్టుకుని చూస్తున్నాం, మనం మాట్లాడుకోవడం మానేసాం… ప్రపంచం బాగుండాలంటే మనమేమీ చేయనక్కర్లేదు… పక్కపక్కనే కూర్చుని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటే చాలు…”
“సరిగ్గా ఊపిరి పీల్చుకుంటే 98 శాతం జబ్బులు రాకుండా మనిషి జీవిస్తాడు, గాలి ఫ్రీగా దొరుకుతుంది… కానీ వాటికి బదులు డబ్బులు పెట్టుకుని సిగరెట్లు కొనుక్కుని చచ్చిపోతాం… ఆరోగ్యంగా ఉండడానికి 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుని తాగితే చాలు… కానీ వాటికి బదులు 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి తాగి పోతాం… ప్రపంచంలో గొప్ప విషయాలైన అమ్మ, నాన్నలను ఉచితంగా ఇచ్చాడు దేవుడు… కానీ, మనం మాత్రం విదేశాలకు వెళ్లి లేనిపోనీ జబ్బులను తెచ్చుకుంటాం…” ‘అమరావతి కధలు’ అనే పుస్తకంలో నేను చదివిన ఒక కధ గురించి చెప్తాను… అంటూ మొదలుపెట్టిన త్రివిక్రమ్… ‘అమరావతిలో ఊళ్ళో ఉండే ఒకతను పొద్దునే నదికి వెళ్లి స్నానం చేసి, సూర్యదేవుడుకు ఒక నమస్కారం పెట్టేవాడు, మధ్యాహ్నం వాళ్ళావిడకు కూర వండమని చెప్పేవాడు, సాయంత్రం అరుగు మీద కూర్చుని దారిన వెళ్ళేవాళ్ళతో కాస్త కబుర్లు చెప్పేవాడు, మళ్ళీ రాత్రికి వాళ్ళవిడకు చెప్పి ఒక కూర వండించుకుని తిని పడుకునేవాడు… అలా 60, 70 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు… ఇంతే… ఇంతకుమించి ఏం చేసేవాడు కాదు… అయితే చివర్లో ఒక మాట రాసాడు…. ఇలా బ్రతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక..! అంటూ ఆడిటోరియంలో అందరి చేత చప్పట్లు కొట్టించాడు త్రివిక్రమ్.
రోడ్డు మీద ఒక అమ్మాయి కనపడుతుంది… చూడగానే ఈల వేయాలనిపిస్తుంది… వేయకుండా వెళ్ళిపొండి… అంత తేలిక కాదు, చాలా గొప్ప గుణం… ఒక పెద్దాయన రోడ్డు మీద పడిపోతుంటాడు… నవ్వకుండా ఉండండి… అంత తేలిక… ఏ తప్పు చేయకుండా బ్రతికిన వాళ్ళే చాలా గొప్పోళ్ళు… అది మీలో కూడా ఉంటారు… అంటూ సవినియంగా నమస్కారం చేసి ముగించారు ‘మాటల మాంత్రికుడు.’ సహజంగా ఇలాంటి మాటలు మరొకరి నోటి వెంట వస్తే… బహుశా ఏంటిరా తినేస్తున్నాడు అన్న అనుభూతి కలుగుతుంది… కానీ, త్రివిక్రమ్ చెప్తుంటే ఇంకాస్త వినాలన్న ఫీలింగ్ కలగడం సహజమే. అందుకే త్రివిక్రమ్… నీలాంటోడు ఒక్కడైనా ఉండాలయ్యా..! చివరగా… మంచి మాటలు ఎవరు చెప్పినా స్వీకరించడం మంచి లక్షణం… త్రివిక్రమ్ కధలో చెప్పినట్లు… ఏ తప్పు చేయకుండా బ్రతికేయడానికి ప్రయత్నిద్దాం..!
No comments:
Post a Comment