చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ ఏడో శతాబ్దిలో అమరావతిలో రెండేళ్లు ఎందుకు గడిపాడు? త్రిపీఠకాల్లో ఒకటైన అభిదమ్మాన్ని ఈ గడ్డ మీదే ఎందుకు అభ్యసించాడు? అసలు ఈ నేలలోని గొప్పదనం ఏమిటి? ఈ గాలిలోని ప్రత్యేకత ఎలాంటిది? ఆంధ్రప్రదేశ్ యాత్ర అంటే - గుహలూ, నదులూ, లోయలూ సముద్రతీరాలూ, అభయా రణ్యాలూ, క్షేత్రాలూ తీర్థాల వెంట ప్రయాణమే కాదు. మనలోని మనల్ని తెలుసుకునే అంతర్ముఖయాత్ర కూడా!
ప్రయాణం చిన్నదైనా, పెద్దదైనా కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది, మనల్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. అనంతమైన ప్రపంచంలో మన ఉనికి ఇసుక రేణువుతో కూడా సమానం కాదనే ఎరుక మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తుంది. అందుకే పర్యాటకులు పసివాళ్లలా... జిజ్ఞాసతో ముందుకు సాగాలని అంటారు. చారిత్రక ప్రదేశాలలో నిత్య పరిశోధకుడిలా, పుణ్యక్షేత్రాలలో పరమ భక్తుడిగా, ప్రాకృతిక ప్రపంచంలో సౌందర్యపిపాసిలా తనని తాను మార్చుకుంటే యాత్ర లక్ష్యం నెరవేరినట్టే. ఆ ప్రదేశాన్ని ఒక్కసారి చూసినా వందల ప్రయాణాల జ్ఞాపకాల్ని మూటకట్టుకున్నట్టే. ఈ కోణంలోంచే మన ఆంధ్రప్రదేశ్‌ను చూసొద్దాం రండి!
పెద్ద సాగరతీరం
ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలలో కొట్టొచ్చినట్టు కన్పించేది విస్తారమైన సముద్రతీరం. గుజరాత్ తర్వాత, రెండో అతిపెద్ద తీరరేఖ ఉన్న రాష్ట్రం ఇదే. ఆ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. సముద్రతీరాల్లో ఎన్నో బీచ్‌లు రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. అసలు సముద్రాన్ని చూడడానికే వైజాగ్ వెళ్లేవాళ్లెందరో. అందులోనూ రామకృష్ణా బీచ్‌ని ప్రముఖంగా పేర్కొనాలి. కనుచూపుమేరా నీలాల బంగాళాఖాతమే. పాలనురగలతో పోటీపడుతూ తీరాన్ని తాకే అలలే. ఎక్కడో అనంతదూరంలో సముద్రాకాశాలు కలసి ముచ్చటించుకుంటున్న భావన!
తన్మయంగా సముద్రం ఒడ్డున అడుగులేస్తుంటే... విమానం అంత పెద్దగా, అంతే ఎత్తుగా... ‘ఐఎన్‌ఎస్ కుర్సురా’! ఆసియాలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ మ్యూజియం ఇది, 1971 ఇండో - పాకిస్థాన్ యుద్ధంలో క్రియాశీలక పాత్ర వహించింది. ఇండియన్ నేవీకి మూడు దశాబ్దాల సేవ లు అందించింది. ఏడాదికి మూడులక్షల పర్యాటకులు దీన్ని సందర్శిస్తుంటారు. రిషికొండ బీచ్ విశాఖకు మరో ఆకర్షణ. నగరానికి కాస్త దూరంగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ సాగరఘోష స్పష్టంగా వినిపిస్తుంది. సముద్రం అంచుల్లో విడిది చేయాలనుకునే వారికి, హరిత బీచ్ రిసార్ట్సు చక్కని వసతిని కల్పిస్తాయి. వాటర్ స్పోర్ట్స్‌కు కావలసిన వసతులన్నీ ఈ రెండు బీచ్‌లలో ఉన్నాయి. నింగీ నేలా సముద్రం... అనుకునేవారి కోసమే ముస్తాబయినట్టు ఉంటుంది భీమిలి బీచ్.
ఇక్కడే బంగాళాఖాతంలో గోస్తని నది సంగమ ప్రదేశమూ ఉంది. తీరం వెంట విజయనగరం వైపు వెళితే చింతపల్లి బీచ్ వస్తుంది. శ్రీకాకుళం జిల్లా వారికి మాత్రం... ఆటవిడుపు అంటే ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం బారువా బీచే! మహేంద్ర తనయ నది సంద్రంలో కలిసే సంగమ ప్రదేశం ఇది.
నెల్లూరు సమీపంలోని మైపాడు బీచ్ వైభోగమే వైభోగం. చాలా పొడవైనసాగర తీరం దీని సొంతం. ఆకుపచ్చని చెట్ల వరుస మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కృష్ణపట్నం ఓడరేవు ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఉప్పాడ, వాడరేవు, సూర్యలంక, మంగినపూడి, మోటుపల్లి, పేరుపాలెం బీచ్‌లు కూడా పర్యాటకంగా మంచి పేరు తెచ్చుకుంటున్నాయి.
చారిత్రక ఆనవాళ్లలో...
పాటలీపుత్రమ్ము కోటకొమ్మల మీద తెలుగు జెండాలు ఎగరేసిన ఘన గతం... ఈనేల సొంతం. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని దంతపురం వరకూ అడుగడుగునా చారిత్రక కట్టడాలే. ఈ గడ్డ మీద బౌద్ధం విశేష గౌరవాన్ని అందుకుంది. బుద్ధుడు నడయాడిన ఉత్తర భారతం కన్నా ఇక్కడే, ఎక్కువ స్థూపాలు, ఆరామాలు కనిపిస్తాయి. శాంకరం, భట్టిప్రోలు, అమరావతి... ఇలా అడుగడుగునా తథాగతుని ఆనవాళ్లే!
గుంటుపల్లి, మొగల్రాజపురం, ఉండవల్లి, బొజ్జన్నకొండ గుహాలయాలు బౌద్ధ విహారాలుగా అలరారాయి. గుంటుపల్లి ఆంఽధ్రా అజంతాగా పేరు తెచ్చుకుంది. తూర్పు కనుమలలోని, దట్టమైన అడవుల్లో ఎన్నో గుహాలయాలు.. అన్నిటినీ చూడాలంటే ఒక రోజంతా సరిపోతుంది. వందల కొద్దీ మొక్కుబడి స్థూపాలు ఇక్కడ ఉండడం విశేషం. ఇక అమరావతి స్థూపంలోని శిల్పాలు అఖండ ఖ్యాతిని గడించాయి. లండన్, కోల్‌కతా, చెన్నై తదితర మ్యూజియాలకి తరలిపోగా మిగిలినవి అమరావతి మ్యూజియంలో కొలువుదీరాయి. ఆ శిల్పాల అద్భుత సౌందర్యానికి, అలనాటి కళాకారుల ప్రతిభకు... దాసోహం అనక తప్పదు. సమ్రాట్ అశోకుడి ఎర్రగుడి శాసనం కర్నూలు జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోనే ఉన్న కేతవరం గుహల్లోని చిత్రాలు నాలుగు వేల సంవత్సరాల నాటి ఆదిమ మానవుడి సంతకాలు.
అద్భుతాలకే అద్భుతం...
భౌగోళిక వింతగా పేరుతెచ్చుకున్న బెలూం గుహలు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. లక్షల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయి. ఈ సున్నపురాయి గుహలు భారతదేశంలోనే పొడవైనవి, అతి పెద్దవి. ఇప్పటివరకూ మూడున్నర కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపారు. ఇందులో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవునా పర్యటకుల సందర్శనానికి వీలు కల్పించారు. మూడు ప్రవేశ ద్వారాల ద్వారా గుహల్లోకి వెళ్లవచ్చు. అరకు లోయ సమీపంలోని అనంతగిరి కొండల్లో ఉన్న బొర్రా గుహలు కూడా పర్యాటకులను వేరే ప్రపంచానికి తీసుకువెళ్తాయి. భారతదేశంలోనే లోతైన గుహలుగా ఇవి పేరు తెచ్చుకున్నాయి. సముద్ర మట్టానికి 2,313 అడుగుల ఎత్తున... 260 అడుగుల లోతుతో పర్యాటకుల్ని అబ్బుర పరుస్తాయి.
వారసత్వ సంపదకు ఏపీలో కొదవలేదు. అలనాటి రాచరికానికి గుర్తులుగా బొబ్బిలి కోట, విజయనగరం కోట, కొండపల్లి కోట, గండికోట ఇలా ఎన్నో కన్పిస్తాయి. అందులోనూ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోట నేటికీ రాచఠీవితో అలరారుతోంది. వేల సంవత్సరాల చరిత్ర ఈ కోట సొంతం. శ్రీకృష్ణదేవరాయలతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన నిర్మాణమిది. ఆంధ్రభోజుడు సింహాసనాన్ని అధిష్ఠించకముందు ఇక్కడే పెరిగాడు. రాయలు తన ప్రాణసఖి చిన్నాదేవిని తొలిసారిగా కలుసుకుందీ ఇక్కడేనంటారు. విజయనగర సామ్రాజ్యానికి చంద్రగిరి నాలుగో రాజధానిగా ఉండేది. వారి తరవాత గోల్కొండ నవాబులు, మైసూరు పాలకులు ఆక్రమించుకున్నారు. ఇక్కడి రాజమహల్, రాణిమహల్ నాటి ఘనతను కళ్లకు కడతాయి. రాజమహల్‌లోని దర్బారు హాలు హంపిలోని లోటస్ మహల్‌ను గుర్తుకు తెస్తుంది. ఇందులో కొద్ది భాగాన్ని మ్యూజియంగా మార్చారు.
ఆధ్యాత్మిక యాత్రలో...
తెలుగుగడ్డ ముక్కోటి దేవతల నిజ నివాసం. అడుగడుగునా పుణ్యక్షేత్రాలే, ఎటు చూసినా దివ్య తీర్థాలే. పంచారామాలు ఏపీ సొంతం. అమరావతి, ద్రాక్షారామం, పిఠాపురం, సామర్లకోట, భీమవరాలలో ఉన్న ఈ శివాలయాల్లో భక్తులు నిత్యం రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. నమకచమకాలతో తరిస్తారు. జ్యోతిర్లింగం క్షేత్రం శ్రీశైలమూ ఆంధ్రదేశంలోనే ఉంది. తిరుపతి వెంకన్న రాష్ట్ర కీర్తిని ప్రపంచపుటంచుల దాకా తీసుకువెళ్లాడు. ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని కలిగిన ఆలయం ఇది. తిరుపతికి వెళ్లేభక్తులు తప్పకుండా దర్శించుకునే ఇతర క్షేత్రాలు... శ్రీకాళహస్తి, కాణిపాకం. శ్రీశైలం తర్వాత, అంతటి ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తి. సువిశాలమైన ఆలయ ప్రాంగణంతో, వాస్తు శిల్పంతో తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. రాహుకేతు పూజలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధం. నరసింహ ఆలయాలకూ ఈ నేల పేరుగాంచింది. పానకాన్ని నైవేద్యంగా స్వీకరించే నరసింహస్వామి మంగళగిరిలో కొలువై ఉన్నాడు. అంతర్వేదిలో అనంతానంతమూర్తి నరసింహస్వామి ఉన్నాడు. నవనారసింహుల సమాహారం అహోబిలం. ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ బెజవాడలో కొలువై ఉంది.. బిరబిరా పారుతున్న కృష్ణానీటిని నెత్తిమీద చల్లుకుని... కొండమీది కొండంత దేవతను దర్శించుకుంటారు. నుదుటిపై పెద్ద బొట్టుతో, కరుణామృతాన్ని కురిపించే కళ్లతో చిరునవ్వులు చిందించే అమ్మను ఎంత సేపు చూసినా తనివితీరదు.
శ్రీకాకుళం జిల్లాలో విహరించేవారు.. అరసవెల్లిలో సూర్యుడిని పూజించుకుని, దశావతారాల్లో రెండో అవతారమైన కూర్మ భగవానుడికి అర్చనలు చేస్తారు. ఆ తరవాత శ్రీముఖలింగానికి దండాలు పెట్టుకుంటారు. తూర్పు గాంగ రాజులు క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. వాస్తు రీతులు ఒరిస్సా పద్ధతుల్లో ఉండడం గమనార్హం.
గోదావరి జిల్లాలలో కొత్తగా పెళ్లైన జంటలు తప్పక దర్శించుకునే దైవం... సత్యదేవుడు. అన్నవరంలో లభించే అమృతతుల్యమైన ప్రసాదం మరో చోట దొరకదని నానుడి. తెలుగు గడ్డ యతీంద్రులకూ మునీంద్రులకూ నెలవు. మంత్రాలయ యతీంద్రులు రాఘవేంద్ర తీర్థులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, జిల్లెళ్లమూడి అమ్మ, జిన్నూరు నాన్నగారు... ఇలా ఎందరో సాధుసంతులు!
ప్రకృతి ఒడిలో...
చిత్రకారుడైన ఏ ప్రకృతి ప్రేమికుడో నీలిరంగు, ఆకుపచ్చల సమ్మేళనంతో తీర్చిదిద్దిన వర్ణచిత్రాల్లా ఉంటాయి పాపికొండలు. ఈ కొండల మధ్య గోదావరి అఖండంగా ప్రవహిస్తూ సాగరంతో సై అంటున్నట్టుగా ఉంటుంది. రాజమండ్రి నుంచి పాపికొండల దాకా సాగే పడవ ప్రయాణాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్రకృతి ప్రేమికులు ఆ అందాలను ఆస్వాదిస్తూ గడపడానికి అక్కడక్కడా వెదురుతో చేసిన కాటేజీలను నిర్మించింది టూరిజం శాఖ. యాంత్రికతకు సుదూరంగా... ఆ ఆతిథ్యం మనసుకు కొత్త సత్తువ ఇస్తుంది.
కనుచూపు మేరా పచ్చదనం పరచుకుని ఉంటుంది కోనసీమలో. అంతెత్తు కొబ్బరి చెట్లు, పచ్చనిపొలాలు, గోదావరి గలగలలు ఈసీమ సొంతం. ఇంకా.... నర్సరీ ప్రపంచం కడయపులంక!
‘ఆంధ్రా ఊటీ’గా పేరుతెచ్చుకున్న అరకు అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. రుతువు ఏదైనా ఆకుపచ్చగా కనువిందు చేయడం అరకు లోయ విశిష్టత. విశాఖపట్నం నుంచి కిరండల్ వరకూ సాగే రైలు ప్రయాణం ఎన్నో మలుపుల్నీ సొరంగాల్నీ దాటుకుంటూ అహ్లాదాన్ని అందిస్తుంది. కాఫీ తోటలకు ప్రసిద్ధిచెందిన ఈ లోయలో ఎగిసిపడే జలపాతాలూ ఆకర్షిస్తుంటాయి. అందులోనూ అనంతగిరి జలపాతాలు నూరు మీటర్ల ఎత్తు నుంచీ జాలువారుతుంటాయి. చెట్ల ఇళ్లలో విడిది చేయాలనుకునే ఉత్సాహవంతులని ఇక్కడి పద్మాపురం గార్డెన్స్ ఆహ్వానిస్తుంటాయి. నేల నుంచి పది అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ‘ట్రీహట్స్’ సరికొత్త అనుభూతుకు కేరాఫ్ అడ్రస్. పెద్దగా వీచే గాలులకు ఈ చెట్ల ఇళ్లు అటూ ఇటూ ఊగుతూ అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిస్తాయి. వీటి కి ‘హ్యాంగింగ్ కాటేజెస్’ అని పేరు.
మంచుకురిసే వేళలో...
విశాఖ జిల్లాలోని లంబసింగి ‘ఆంధ్రా కాశ్మీర్’గా విఖ్యాతిచెందుతోంది. డిసెంబరు మాసంలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలకి చేరుకుంటుంది. ఈ ప్రదేశమంతా.. మంచు ముసుగు కప్పుకున్న గిరిజన కాంతలా ఉంటుంది. దక్షిణ భారతంలో విస్తారంగా మంచుకురిసే ప్రాంతం ఇదొక్కటే. టూరిజం పరంగా ఇప్పుడిప్పుడే లంబసింగి పుంజుకుంటోంది.
ఆసియాలోని మంచి నీటి సరస్సు కొల్లేరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని ఈ సరస్సు సుమారు మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది. అరవై మూడు రకాల మత్స్యజాతులకూ తాబేళ్లూ తదితర సరీశృపాలకూ కొల్లేరు పుట్టినిల్లు. ఈ సరస్సు అంచుల్లోని ‘కొల్లేరు బర్డ్ శాంక్చురీ’ పక్షి ప్రేమికుల స్వర్గధామం. నవంబరు నుంచి మార్చి వరకు ఇక్కడికి ఆస్ట్రేలియా, సైబీరియా, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల పక్షులు చుట్టపుచూపుగా వస్తుంటాయి. ఆ అపూర్వ అతిథులను పరామర్శించడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యటకులు కొల్లేరు చేరుకుంటారు. ఆ దృశ్యం అద్భుతః
వలస పక్షులతో కళకళలాడే మరో సరస్సు పులికాట్. దాదాపు 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో... దేశంలోని రెండో అతి పెద్ద సరస్సు ఇది. ఎదురుగా నిలుచుంటే సముద్రంలా భ్రమింపచేస్తుంది. ఇది ఎన్నో రకాల చేపలకూ ఆల్గేలకూ నిలయం. ఇక్కడే ‘పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ’ ఉంది. ఇది సుమారు 115 జాతుల పక్షులకు నిలయం. గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు విరివిగా వస్తుంటాయి. శ్రీహరికోట ద్వీపం బంగాళా ఖాతాన్ని, పులికాట్ సరస్సును వేరు చేస్తుంటుంది. పుటికాట్‌ను చూడ్డానికి వెళ్లే వారు... శ్రీహరికోటలోని ‘సతీష్ ధావన్ స్పేస్ సెంటర్’ను కూడా తప్పక తిలకిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక రాకెట్ లాంచ్ సెంటర్ ఇది. కాకపోతే, పెరుగుతున్న పట్టణీకరణ వల్ల పర్యావరణపరంగా పులికాట్ ప్రమాదపు టంచుల్లో ఉంది. మరో వందేళ్ల వరకైనా పులికాట్ మనగలుగుతుందా... అన్న సందేహాన్ని పర్యావరణ వేత్తలు వ్యక్తపరుస్తున్నారు.
రాష్ట్రంలో అతి పొడవైన జలపాతాలంటే... గుర్తుకొచ్చేది మాత్రం చిత్తూరు జిల్లాలోని తలకోనే. తిరుపతికి యాభై కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవిలో తలకోన ఉంది. దాదాపు 272 అడుగుల ఎత్తు నుంచి జాలు వారే ఈ జలపాతం మధ్యలోంచి ఇంద్రధనస్సు విరుస్తుంది. చెట్లూ చేమలకు కొదవే లేదు. అందుకే ఆ జలధారలకు ఔషధ గుణాలు వచ్చాయంటారు. తలకోన బెస్ట్ ట్రెకింగ్ స్పాట్‌గానూ పేరుతెచ్చుకుంది.
కొండపల్లి బొమ్మలు.. కలంకారి వన్నెలుశ్రీ
ఆంధ్రప్రదేశ్ పర్యాటకులు రాష్ట్రం నుంచి తీపిగుర్తుగా తీసుకెళ్లే వస్తువులలో ముఖ్యమైనవి.. కొండపల్లి బొమ్మలు, కలంకారీ వస్త్రాలు. విజయవాడ సమీపంలోని కొండపల్లి గత నాలుగు వందల ఏళ్లుగా కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. దశావతారాలు, కృష్ణలీలలతో పాటు గ్రామీణ జీవితం, వన్యప్రాణుల వన్నెచిన్నెల బొమ్మలు నేడు మారె ్కట్‌లో విరివిగా లభిస్తున్నాయి. విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలంకారీ పనితీరుకు ప్రసిద్ధిచెందిన దేశాలు రెండే రెండు. మొదటిది ఇరాన్, రెండోది ఇండియా. భారత్‌లో కలంకారీ వస్త్రాలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే లభ్యం అవుతాయని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇందులో మళ్లీ... మచిలీపట్నం, శ్రీకాళహస్తి అనే రెరడు విభాగాలు ఉన్నాయి. పేరులో ఉన్నట్టుగా ప్రత్యేక కలంతో కాటన్ దుస్తులపై పెయింట్ చేయడం కలంకారీ వస్త్రాల ప్రత్యేకత. ఇందులో చీరలు, డ్రస్ మెటీరియల్ దగ్గర నుంచి దుప్పట్ల వరకూ అనేకం లభ్యం. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, వెంకటగిరి... చేనేత, జరీ, పట్టు వస్ర్తాలకు పెట్టింది పేరు. ఇవి మగువల మనసు దోచుకోవడంలో ముందుంటాయి.
అరిటాకు నిండుగా...
ఆంధ్రదేశాన్ని ఓ పెద్ద ఆవకాయ జాడీతో పోలుస్తాడో కవి. కాదుకాదు, అదో నవకాయ పిండివంటలు వడ్డించిన వెండిపళ్లెం.... అంటాడో భోజన ప్రేమికుడు. ప్రతి తెలుగు ఇల్లాలూ అన్నపూర్ణకు సమ ఉజ్జే! వండటంలోనూ, వడ్డనలోనూ... ఆమెకు సరిసాటి లేరు. ఆ తల్లి వంట అమృతాల పంట. ఎన్ని రుచులు! ఎంత పాకశాస్త్ర సృజన! అరిటాకుకి ఓ మూలన నూనె కారుతూ కన్పించే ఆవకాయ మరీ మరీ కవ్విస్తుంది. ఆవ పెట్టి చేసిన పనసపొట్టు కూర తనవైపునకు దృష్టిని తిప్పుకుంటుంది. ఊర మిరపకాయలు, వడియాలు, అప్పడాలు, బజ్జీలు, రోటి పచ్చళ్లు, పప్పు, సాంబారు, దప్పళం, బొబ్బట్లు, పులిహోరా, పాయసం, పరమాన్నం.. అరిటాకు నిండా వంటలు లొట్టలు వేయిస్తాయి. ఘుమఘుమలాడే పరిమళాలు భోజనానికి పిలుస్తాయి..
నకనకలాడే ఆకలికి చకచకా సమాధానం చెబుతాయి. ఆంధ్రప్రదేశ్ రుచులంటే అమెరికాలోనూ ఫేమసే! ఆ ఫార్ములాతో రెస్టరెంట్లు పెట్టి కుబేరులైనవారూ ఉన్నారు. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని... కొంచెం నూనె తగిలించి తింటే.. రుచే వేరు! మళ్లీ ప్రాంతానికో ప్రత్యేక రుచి. కాకినాడ కాజా తియ్యదనం, ఆత్రేయపురం పూతరేకుల కమ్మదనం, మామిడితాండ్ర మాధుర్యం... వర్ణించడం కష్టమే. నోట్లో వేసుకోగానే కరిగిపోయే సున్నుండలు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల సొంతం. అట్లు, దోసెల్లో అందెవేసిన చెయ్యి గోదారి మహిళది. సన్నగా ఉల్లిపాయలు తరిగి, ఇంకా సన్నగా అల్లాన్ని తరిగి, కొంత జీలకర్ర దట్టించి... అలా నెయ్యి వేసిన పెసరట్టు రుచిని వర్ణించడం కష్టం. ఉప్మాపెసరట్టంటే కాకినాడ వెళ్లాల్సిందే. అమలాపురం పరిసర ప్రదేశాల్లో మాత్రమే కన్పించేవి ‘పొట్టిక్కలు’. ఇండ్లీపిండిని పనస ఆకుల్లో పెట్టి ఉడికించడం వల్ల వీటి పోషక విలువలు అధికం.
ఇక నాన్‌వెజ్ వంటకాలకొస్తే.. రంపచోడవరం అటవీ ప్రాంతంలో విశేషంగా కన్పించేది ‘బాంబూ చికెన్’. ఇటీవలే ఈ వంటకం గోదావరి తీరాల్లోకి పాకింది. ఏపీ ఫుడ్ టూరిజంలో ‘బాంబూ చికెన్’ ముందుంటోంది. విస్తారమైన సముద్ర తీరం వల్ల నెల్లూరు పీతలు, రొయ్యలకు ఫేమస్. ఈ సీమలో ఎంతో ప్రసిద్ధిచెందింది ‘రొయ్యల వేపుడు’. ఇది ఎంతో బలవర్ధకమైందీ, రుచికరమైందీ. రాయలసీమ రుచుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది ‘రాగి సంగటి - నాటు కోడి పులుసు’. ప్రాంతాలను బట్టి కొద్దికొద్దిగా రుచులు మారుతున్నా.. కొసరి కొసరి వడ్డించే ప్రేమ మాత్రం ఆచివర నుంచి ఈచివరి దాకా సమానమే! ఇలా ఆంధ్రప్రదేశ్ అణువణువూ ప్రతి భారతీయ యాత్రికుడినీ పులకింపచేస్తుంది - పచ్చదనంతో, నిండుతనంతో, ఆప్యాయలతో, అనుబంధాలతో, ఘనమైన వారసత్వంతో! కాబట్టే ఏపీ టూరిజం... ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ అనే నినాదంతో మన ముందుకు వస్తోంది. మనల్ని రారమ్మంటూ ఆహ్వానిస్తోంది.
- డి.పి.అనురాధ
No comments:
Post a Comment