Wednesday, July 4, 2018

BACK TO FARM : గోవు లేకుండానే సేంద్రియ సేద్యం

• గోవు లేకుండానే సేంద్రియ సేద్యం
* వేస్ట్‌ డీకంపోజర్‌తో బహుళ ప్రయోజనాలు
సేంద్రియ ఎరువుల కొరతను తీర్చేందుకు ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం వేస్ట్‌ డీ కంపోజర్‌ను తయారు చేసింది. కేవలం 20 రూపాయలు ఖర్చుతో వ్యవసాయ భూమిని సారవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అధిక దిగుబడులకు తోడ్పడే ఆ ద్రావణం విశేషాలు.
తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో రైతులు గో ఆధారిత సేద్యం చేస్తున్నారు. రసాయనాలు, క్రిమిసంహారకాలు ఉపయోగించడం వల్ల తలెత్తుతున్న అనర్ధాలను గమనించిన ప్రజలు సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలను ఆహారంగా తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. సేంద్రియ సేద్యం చేయాలనే ఆలోచన వున్నా సేంద్రియ ఎరువులు ఎక్కడా లభించకపోవడంతో సొంతగా వాటిని తయారు చేసుకోలేని రైతులు రసాయనాలు, క్రిమిసంహారకాలతోనే సేద్యం చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఘజియాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం సేంద్రియ ఎరువుల కొరతను తీర్చేందుకు వేస్ట్‌ డీ కంపోజర్‌ దావణాన్ని తయారుచేసింది. గత ఏడాది ద్వితీయార్థం నుంచి దేశవ్యాప్తంగా ఈ ద్రావణాన్ని చిన్న సీసాలలో విక్రయిస్తున్నది. 30 మిల్లీలీటర్ల ఈ సీసా విలువ కేవలం 20 రూపాయలే. 200 లీటర్ల నీటితో వున్న డ్రమ్ములో రెండు కిలోల బెల్లం పొడిచేసి బాగా కలపాలి. ఆ తరువాత అందులో వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణాన్ని కలపాలి. రోజూ ఉదయం, సాయంత్రం కర్రతో కలియతిప్పుతూ 5 రోజులు నిల్వ వుంచాలి. అప్పడు వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణం ఉపయోగానికి సిద్ధంగా వుంటుంది. బెల్లం రంగులో వున్న నీళ్లు 5 రోజుల తరువాత లేత పసుపు రంగులోకి మారతాయి.
ఇది జీవామృతానికి, నీమాస్త్రానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నేలలో సారాన్ని పెంపొందించేందుకు ఉపయోగించుకోవచ్చు. పొలానికి నీరు పెట్టే సమయంలో ఈ వేస్ట్‌ డీ కంపోజర్‌ను ఎకరాకు 200 లీటర్ల ద్రవాన్ని పొలంలో పారించాలి. 6 నెలలు పలు దఫాలుగా ఇలా చేయడం వల్ల నేలలో వున్న పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు పెంపొందుతాయి. సేంద్రియ కర్బనాలు పుష్కలంగా పెరుగుతాయి. నేల తిరిగి జీవం పోసుకుంటుంది. చేనుకు చేవ కలగడంతో దిగుబడులు భారీగా పెరుగుతాయంటున్నారు ఘజియాబాద్‌ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌. ఈ ద్రావణాన్ని విత్తన శుద్ధికి కూడా ఉపయోగించుకోవచ్చు. మనం విత్తుకునేందుకు సిద్ధం చేసుకున్న విత్తనాలపై ఈ ద్రావణాన్ని పల్చగా చల్లుకుని, ఓ అరగంట ఆరబెట్టుకుని, ఆ తరువాత విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణకు కూడా 30 మిల్లీలీటర్ల వేస్ట్‌ డీ కంపోజర్‌ను వారానికి ఒకసారి పంట మీద చల్లడం వల్ల పలు రకాల చీడపీడల నివారణ అవుతున్నాయి. పంట వ్యర్థాలు, పేడ, ఆకులు వంటి ఇతర వ్యర్థాలను కుప్పగా వేసి, దాని మీద 100 లీటర్ల వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణాన్ని చల్లాలి. టన్ను వ్యర్థాల మీద వంద లీటర్లు చల్లితే సరిపోతుంది. 30-40 రోజుల్లో ఆ వ్యర్థాలు ఎరువుగా మారతాయి.
హైదరాబాద్‌లోని బాబూఖాన్‌ ఎస్టేట్‌లో 4168 షాప్‌లో సేంద్రియ రైతు సేవా కేంద్రంలో వేస్ట్‌ డీ కంపోజర్‌ సీసాలు అందుబాటులో వున్నాయి.
ఫోన్‌ : 040 - 23235858

No comments:

Post a Comment