- బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం
- కేంద్ర నిర్ణయంపై డీఈడీ అభ్యర్థుల్లో ఆందోళన
- బ్రిడ్జి కోర్సు ఏంటని ప్రశ్నిస్తున్న నాయకులు
కాకినాడ: ఈ నెల 6న డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని విశాఖపట్టణంలో విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందుకోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోపక్క డీఈడీ అభ్యర్థుల్లో ఆందోళన ఏర్పడింది. బీఈడీ అభ్యర్థులు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రప్రభుత్వం గెజిట్ జారీచేయడంతో తమ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు పోటీ వస్తారని డీఈడీ అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. బీఈడీ అభ్యర్థులు డీఎస్సీలో పోస్టు సాధిస్తే, ఉద్యోగంలో చేరిన రెండేళ్లలో ఆరునెలల బ్రిడ్జికోర్సు చేయాలని కేంద్రం కొర్రీ పెట్టింది. ఇప్పటికే తాము క్వాలిఫైడ్ అని, బ్రిడ్జికోర్సు చేయమని బీఈడీ నిరుద్యోగుల రాష్ట్ర సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమకు ఎస్జీటీ అవకాశం కల్పించాలని పదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని, ఫలితం దక్కిందని సంబరపడుతోన్న నేపథ్యంలో ఇటువంటి అసంబద్ద నిర్ణయాలు ఏంటని వాపోతున్నారు. టీచర్ ఉద్యోగాలకు అర్హులైన తమకు మళ్లీ బ్రిడ్జికోర్సు ఏంటని సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఖాళీలపై అస్పష్టత
టీచర్ కొలువులకు అర్హతకు కీలక ఘట్టం టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ముగిసింది. ఇక నోటిఫికేషన్ మిగిలి ఉంది. జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయనే అంశంపై అస్పష్టత నెలకొంది. ఉపాధ్యాయ కొలువులు భర్తీచేసి నాలుగేళ్లు గడుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఓ దఫా డీఎస్సీ నిర్వహించి ప్రభుత్వం మమ అనిపించేసింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల టీచర్ కొలువులను భర్తీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత టీచర్ కొలువులను భర్తీ చేయలేదు. ఈసారి డీఎస్సీలో 14 వేలకు పైగా టీచర్ కొలువులు భర్తీ చేస్తామని, ఈ ప్రక్రియ ఏపీపీఎస్పీకి అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహిస్తే జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీలున్నాయో ముందుగా ప్రకటించాల్సి ఉందని, కటాఫ్ మా ర్కులు రోస్టర్ వారీ పోస్టులను స్పష్టం చేయాలని అభ్యర్థులు పట్టుపడుతున్నారు. ఇవేమి ప్రకటించకుండా నోటిఫికేషన్ జారీ చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు.
పోస్టులు పెరిగే అవకాశం
తెలుగు 74, హిందీ 70, ఇంగ్లీషు 47, సంస్కృతం 4, ఉర్దూ2, గణితం 45, పీఎస్ 31, ఎన్‌ఎస్ 60, సోషల్ 84, పీఈటీ 52, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)-356, ఉర్దూ13, ఎల్‌పీ తెలుగు 54, ఎల్‌పీ హిందీ 94, ఎల్‌పీ సంస్కృతం 6, ఎల్‌పీ ఉర్దూ2, పీఈటీ 133. ఎల్‌పీ హిందీ, తెలుగు, ఎన్‌ఎస్ పోస్టుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. ఎల్‌పీ హిందీ సబ్జెక్టుకు సంబంధించి 400 మంది విద్యార్థులకు కొన్ని చోట్ల ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. దీంతో ఈ పోస్టులు కూడా పెరిగే సూచనలున్నాయి.
‘బీఏ లిట్’ వారినే అనుమతించాలి
స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) ఇంగ్లీష్ పోస్టులకు బీఏలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివిన వారికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎస్‌ఏ విభాగంలో లెక్కలు, తెలుగు, సోషల్‌స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయాలజీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. వీటన్నింటికి సంబంధిత డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఆయా సబ్జెక్టులు చదివినవారినే అనుమతిస్తున్నారు. కానీ ఇంగ్లీష్ పోస్టులకు డిగ్రీలో లిటరేచర్ చదవకపోయినా, పీజీలో ఎంఏ చేసిన వారికి అవకాశం ఇస్తున్నారు. తదనుగుణంగా డిగ్రీ మూడు సంవత్సరాల ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వారికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ లెక్కలు
జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 3,917 పాఠశాలలున్నాయి. వీటిలో 2,734 ప్రాథమిక పాఠశాలలు, 364 ప్రాథమికోన్నత పాఠశాలలు, 534 ఉన్నత పాఠశాలలు, 285 పురపాలక, నగరపాలక సంస్థల పాఠశాలలు, 155 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 16,252 మంది ప్రస్తుతం ఉపాధ్యాయులున్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 2,094 మంది, ప్రాథమిక పాఠశాలలో 4584 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7672 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2014 డీఎస్సీ తరువవాత ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. పదోన్నతులు, ఉద్యోగ విరమణలు కారణంగా చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ విధంగా జిల్లాలో 1500కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయని ఉపాధ్యాయ సంఘనేతలు చెప్తున్నారు. గతంలో డీఎస్సీ ప్రకటనకు ముందు డీఈవో కార్యాలయం నుంచి ప్రభుత్వానికి 1150కి పైగా ఖాళీలు ఉన్నాయని నివేదిక వెళ్ళినట్టు సమాచారం. తాజా పరిస్థితి బట్టి ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చని సమాచారం.
No comments:
Post a Comment