Monday, June 6, 2016

Health : సాంకేతిక ఉచ్చులో బాల్యం

సాంకేతిక ఉచ్చులో బాల్యం

 కాసిపేట: అరచేతిలో అంతర్జాతీయ సమాచారం.. ఉన్నచోటి నుంచే సమాచార సేకరణ.. ఎలాంటి పనులనైనా సులభంగా చేసుకునే వెసులుబాటు.. చరవాణితో యావత్తు ప్రపంచాన్ని చుట్టేస్తున్నామనే సంతోషం ఒకవైపు.. చిక్కుల్లో పడుతున్నామనే ఆందోళన మరోవైపు వెంటాడుతోంది. ఇంటా బయట చరవాణితో ఎక్కువ సమయం గడుపుతున్నా పెద్దలను గమనిస్తున్న చిన్నారులు సైతం చరవాణిలకు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల కంటే వేగంగా ఆపరేట్‌ చేస్తూ అబ్బురపరుస్తున్నారు. సాంకేతికపరంగా సంతోషించాల్సిన విషయమే. అయినా చరవాణిలు, ట్యాబ్‌వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు 12ఏళ్ల లోపు చిన్నారుల ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలియకుండానే అలవాటు.. చిన్నతనంలో మెదడు ఎదుగుదల అనేది పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్లలోపు చిన్నారులపై అధిక ప్రభావం చూపుతుంది. ఇలాంటి క్రమంలో చిన్నారులకు చరవాణి, ట్యాబ్స్‌, ఇంటర్నెట్‌ ప్రభావం వారిపై పడితే ఎదుగుదలకు అవరోదంగా మారుతుంది. ఏడిస్తే ఆడుకోవడానికి బొమ్మలు చూపిస్తూ, బంధుమిత్రులతో ఫోన్‌ చేసినప్పుడు సరదాగా పిల్లలతో మాట్లాడిస్తున్నారు. ఒకరకంగా తెలియకుండానే పిల్లలకు క్రమంగా చరవాణి అలవాటు చేస్తున్నారు. చిన్నారులు చరవాణి వినియోగం ఆటలు ఆడటం వల్ల ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాల వెళ్లే ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఇద్దరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇదీ విద్యాపరంగా ప్రతికూలంగా మారుతుందని నేర్చుకునే అంశాల్లో వెనుకబడిపోతున్నారు.
మానసిక సమస్యలు.. సాధారణంగా పెద్దల్లో మానసిక సమస్యలుంటాయి. చరవాణి పుణ్యమాని చిన్నారుల్లో మానసిక వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. సాంకేతికతను వినియోగించడంలో పిల్లల్లో వ్యాకులత పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దేనిమీద ఏకాగ్రత పెట్టకపోవడంతోపాటు మానసిక సమస్యలు తలెత్తి పిల్లల ప్రవర్తననే మార్చేస్తున్నాయి.
టీవీ, వీడియోగేమ్స్‌, చరవాణి, ట్యాబ్‌లతో పిల్లలు శారీరక క్రీడలకు దూరమవుతున్నారు. పడుకునే సమయంలో పిల్లలు చరవాణిలతో ఆటలు ఆడుతున్నారు. దీంతో చిన్న వయస్సులో వూబకాయం బారిన పడుతున్నారు. పెద్దయ్యాక మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
సాధారణంగా పిల్లలు మొండిగా వ్యవహరిస్తుంటారు. చరవాణి, ట్యాబ్‌ల వినియోగంతో ఇది మరింత ఎక్కువైంది. చేతిలో చరవాణి తీసుకుంటే మళ్లీ ఇచ్చే వరకు ఏడుస్తూనే ఉంటారు. ఇటీవల ఎక్కువ మంది చిన్నారులు చరవాణి, ట్యాబ్‌లు వినియోగిస్తున్నారు. అందులో హింసతో కూడిన ఆటలు ఉండటం చిన్నారుల ప్రవర్తనలో మార్పులకు కారణమవుతున్నాయి.
పిల్లలు చరవాణికి దగ్గరయ్యే కొద్దీ కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. ఒకప్పుడు ఇరుగు పొరుగు వాళ్లు పిల్లలతో సందడిగా ఉండే ఇళ్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. కారణం ఎవరికీ వారు చరవాణి లోకంలో విహరించడం. పిల్లలు చరవాణిలో ఆటలు ఆడుతూ వస్తువులతోనే సంబంధాలు పెంచుకుంటున్నారు. చివరికి ఇది వ్యసనంగా మారి అందరికీ దూరమవుతున్నారు.
చిన్నతనం నుంచి చరవాణి వాడటం వల్ల రేడియోధార్మిక ప్రభావం పడుతుంది. రోగనిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీస్తోంది. చరవాణి పిల్లలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. రోజులో సగం నిద్రపోవాల్సిన పిల్లలు అర్ధరాత్రి వరకు మెలకువతోనే ఉంటూ చరవాణిని వినియోగిస్తున్నారు.
పెద్దల్లో మార్పు అవసరం... ఇంట్లో ఉన్నంత సేపు పెద్దలు చరవాణి వినియోగానికి దూరంగా ఉండాలి. అవసరమైన కాల్స్‌కు మాత్రమే పరిమితం కావాలి.
ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు వినియోగించాల్సి వస్తే పిల్లలు నిద్రపోయాక, బడికెళ్లాక వినియోగించాలి.
ఖాళీసమయాల్లో పిల్లలను మైదానంలోకి తీసుకెళ్లి ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
ఇంట్లో ఒంటరిగా కాకుండా పిల్లలతో కలిసిపోయేలా చిన్నారులకు అలవాటు చేయాలి.
అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడీయాట్రిక్స్‌, కెనడియన్‌ సొసైటీ పీడీయాట్రిక్స్‌ ప్రకారం
చదువుపై ప్రభావం వెంకటేష్‌, మానసిక వైద్య నిపుణులు చరవాణి వినియోగం పిల్లల చదువుపై ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల సమయం వృథాతోపాటు బాల్యంలోనే బానిసలుగా మారి పురోగతి నిలిచిపోతుంది. చిన్నతనం నుంచి ఉపకరణాలు వాడకంతో కుటుంబసభ్యులతో కలివిడిగా ఉండలేకపోతున్నారు. ఫలితంగా బంధాల విలువలు తెలియవు. మానసిక సమస్యలు తలెత్తుతాయి. శారీరకంగా ఎదుగదల ఉండదు. పెద్దలు చిన్నారుల ముందు చరవాణిలను ఎక్కువగా వాడకూడదు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఫోన్లు అనుమతించకుండా దూరం చేస్తే వారి భవితకు మంచిది.
వినికిడి శక్తి లోపిస్తుంది సునీల్‌, కాసిపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి చరవాణి వినియోగంతో చిన్నారుల చెవినరాలు దెబ్బతిని తొందరగా చెవిటితనం వస్తుంది. రేడియోధార్మిక ప్రభావంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తకున్నా.. దీర్ఘకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చరవాణి, ట్యాబ్‌, కంప్యూటర్‌లను వినియోగించేటప్పుడు ఎక్కువ సేపుచూడటం వల్ల కంటిచూపుపై ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం చరవాణిలకు దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.

No comments:

Post a Comment