Sunday, June 19, 2016

Career : AP Gov jobs ఇక నోటిఫికేషన్లు

  • ఒకటి రెండు నెలల్లో విడుదల
  • ఆపై 6 నెలల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి 
  • పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే భర్తీ 
  • వారంలో గ్రూప్స్‌ 1,2,4లకు కొత్త సిలబస్‌ 
  • 1999, 2011 నోటిఫికేషన్లపై ట్విస్ట్‌లు 
  • సాధ్యమైనంత త్వరగా వాటికి పరిష్కారం 
  • ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ వెల్లడి 

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) :
 గ్రూప్స్‌ నోటిఫికేషన్లు ఒకటి రెండు నెలల్లో విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి తొలుత గ్రూప్‌-1, 2, 3 సర్వీసెస్‌ నోటిఫికేషన్లు ఇస్తామని, ఆ తర్వాత ఇతర రిక్రూట్‌మెంట్లపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. నోటిఫికేషన్లు వెలువరించిన 6 నెలల్లో రిక్రూట్‌మెంట్లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతోపాటు భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ ఇయర్‌ క్యాలెండర్‌నీ దృష్టిలో పెట్టుకొని.. ఆరు నెలల కాలంలో ప్రక్రియను పూర్తి చేయాలని అనుకొంటున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపధ్యంలో శనివారం ఉదయభాస్కర్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘‘పారదర్శకంగా, పూర్తిగా ప్రతిభ ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుంది. దళారుల మాటలు నమ్మి మోసపోరా’’దని అభ్యర్థులకు ఆయన సూచించారు. నోటిిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చినప్పటికీ ఉన్నత స్థాయి (గ్రూప్‌-1) పోస్టుల నుంచే భర్తీ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. వారం రోజుల్లో గ్రూప్‌-1, 2, 4 పరీక్షల కొత్త సిలబస్‌ ప్రకటిస్తామన్నారు. భర్తీ చేయాల్సిన పోస్టులు, రోస్టర్‌ను ఖరారు చేసి, ఆయా విభాగాలు తమకు పంపుతాయని, అయినా ఆయా శాఖాధిపతులతో చర్చించిన తర్వాతనే రోస్టర్‌ విధానాన్ని నిర్ణయిస్తామని వివరించారు. నిరుద్యోగుల సౌకర్యార్థం వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిసే్ట్రషన్‌ (ఓటీపీఆర్‌) ను ప్రవేశపెట్టామని, ఇప్పటి వరకు ఏడు వేల మంది నిరుద్యోగులు వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. 
వయోపరిమితిపై.. 
దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు లేనందున వయోపరిమితిని పెంచాలన్న డిమాండ్‌ నిరుద్యోగుల నుంచి వస్తోంది. ఈ అంశంపై స్పందిస్తూ, ‘‘ఇది సమంజసమైన కోరికే. అయితే, ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు అనుగుణంగానే కమిషన్‌ వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగుల విజ్ఞాపనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ’’తామని హామీ ఇచ్చారు. పెద్ద పోస్టుల నుంచి చిన్న పోస్టుల క్రమంగా రిక్రూట్‌మెంట్లు పూర్తి చేయాలన్నది తమ అభిమతమన్న ఆయన.. గ్రూప్‌-1 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ముందు 1999 , 2011 నోటిఫికేషన్లకు సంబంధించి రెండు ట్విస్ట్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 1999లో ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ కాని పోస్టులను తదుపరి మెరిట్‌ అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలని తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సదరు నోటిఫికేషన్‌కు సంబంధించి సుమారు 70 పోస్టులు భర్తీ కాలేదు. వాటిని అప్పటి మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేస్తే .. 2011 నోటిఫికేషన్‌లో పేర్కొన్న 310 పోస్టులలో కోత పడుతుంది. అలాగే 2011 నోటిఫికేషన్‌కు సంబంధించి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’లో తప్పులు జరిగినందున , అదనంగా తీసుకున్న 500 మంది అర్హులకు కూడా వర్తించేలా మళ్లీ మెయిన్స్‌, ఇంటర్వ్యూలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది’’ అని వివరించారు. 2011లో నోటిఫై చేసిన 310 ఖాళీలలో ఆంధ్రప్రదేశ్‌కి 170 పోస్టులు, తెలంగాణకు 140 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోయినందున తమ ఖాళీలను ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా మళ్లీ ఎలా భర్తీ చేస్తారని టీఎ్‌సపీఎస్సీ అంటోందన్నారు. 1999, 2011 నోటిఫికేషన్లకు సంబంధించిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

No comments:

Post a Comment