దక్షిణ మధ్య రైల్వేలో 12 వేల ఉద్యోగాలు | |
* భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం
* నెలాఖరులోపు నోటిఫికేషన్ ఈనాడు, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆరు విభాగాల్లో కలిపి 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)ల ద్వారా వీటిని భర్తీ చేస్తారు. నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ద.మ. రైల్వే జోన్ భారతీయ రైల్వేలో ఉద్యోగుల సంఖ్యాపరంగా, ఆదాయపరంగా కీలకమైంది. ద.మ.రైల్వే సహా ఇతర జోన్లలోనూ పెద్దసంఖ్యలో ఖాళీలున్నాయి. త్వరలో నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఖాళీలు, వచ్చే ఏడాదివి కూడా కలుపుకుని దేశవ్యాప్తంగా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఫిబ్రవరిలో దాదాపు 1.31 లక్షల ఉద్యోగాలను ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ద.మ రైల్వే పరిధిలో 12వేల పైచిలుకు ఉద్యోగాలను చేర్చారు. ద. మ రైల్వేలో విభాగాలవారీగా ఖాళీలు ద.మ రైల్వే జోన్‌లో మొత్తం 97,547 ఉద్యోగాలున్నాయి. ప్రస్తుతం 79,607 మంది పనిచేస్తున్నారు. 17,940 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోందని కార్మిక సంఘాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుబాటులోకి వస్తున్న కొత్త రైళ్లు, కొత్త రైల్వేలైన్లను పరిగణనలోకి తీసుకుని శాంక్షన్డ్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నాయి. * సత్వర భర్తీతోనే భద్రత ప్రయాణికుల్ని గమ్యస్థానానికి క్షేమంగా చేర్చడంలో లోకోపైలెట్ల పాత్ర ఎంతో కీలకం. ఇతర పోస్టులతో పోలిస్తే లోకోపైలెట్ల ఎంపిక, శిక్షణ ప్రక్రియ కఠినంగా ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకుంటుంది. అన్నిపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత సిమ్యులేటర్‌పై ఆరు నెలల శిక్షణ ఉంటుంది. తర్వాత గూడ్సు రైళ్లు కొంతకాలం నడిపిన తర్వాతగానీ ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు అవకాశం రాదు. మూడు వేల పోస్టుల వరకు ఖాళీగా ఉండటంతో ఉన్నవారిపై పని ఒత్తిడి పెరుగుతోందని, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడానికి ఇబ్బందిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. పట్టాలు సాగినప్పుడు రెండింటి మధ్య ఖాళీ పెరగడం, పట్టాల కింద కంకర తగ్గడం వల్ల ప్రమాదాలకు దారితీస్తుంది. పట్టాలను నిశితంగా పర్యవేక్షించే ట్రాక్ మెయింటెనర్ పోస్టులు కూడా నాలుగువేల వరకు ఉన్నాయి. ప్రయాణికుల భధ్రత దృష్ట్యా నోటిఫికేషన్ విడుదలతోపాటు భర్తీ ప్రక్రియ సత్వరం పూర్తిచేయాలని కోరుతున్నారు. |
---|
Thursday, February 14, 2019
RRB JOBS :దక్షిణ మధ్య రైల్వేలో 12 వేల ఉద్యోగాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment