ఒత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ!
మంచి వేతనం.. పని ఒత్తిడి తక్కువ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అదీ పదోతరగతి విద్యార్హతతో.. అలాంటి అవకాశాన్ని మన ఏపీ పోస్టల్ సర్కిల్ పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తోంది.
ఏపీ పోస్టల్ సర్కిల్లో 245 పోస్టులు
- పోస్టుమెన్ 234 - మెయిల్ గార్డు 11
పదోతరగతి విద్యార్హతతోనే జీవితంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది తపాలా శాఖ. పోస్టు మెన్, మెయిల్ గార్డు అంటే ఇవేవో చిన్న ఉద్యోగాలే అనుకోవడం పొరపాటే. ఎందుకంటే కొత్తగా అమల్లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం ఈ రెండు ఉద్యోగాలకూ 21700 మూలవేతనం దక్కుతుంది. దీనికి అదనంగా కరవుభత్యం, ఇంటిఅద్దె భత్యం... మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గ్రామంలో పోస్టింగ్ వచ్చినప్పటికీ పాతికవేల రూపాయల నెల జీతం గ్యారెంటీ. అంతేకాకుండా ఒత్తిడి, పనివేళలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనుభవంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఖాళీలను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు. ప్రశ్నలు సైతం పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి రైల్వే ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వీటినీ ప్రయత్నించవచ్చు.
పరీక్ష ఇలా...
వంద మార్కులకు ఆప్టిట్యూడ్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. అవి...
పార్ట్ - ఎ: జనరల్ నాలెడ్జ్, పార్ట్ - బి: మ్యాథమేటిక్స్
పార్ట్ - సి: ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. విభాగం 1లో ఇంగ్లిష్, 2లో తెలుగు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
అర్హత సాధించాలంటే...
పార్ట్ ఎ, బిలు కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. అలాగే పార్ట్ సిలో రెండు విభాగాలూ కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. ఇలా విభాగాల వారీ మార్కులు సాధించడంతోపాటు మొత్తం ప్రశ్నపత్రం నుంచి ఓసీలు 40, ఓబీసీలు 37, ఎస్సీ, ఎస్టీలు 33 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. అనంతరం అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఎంపికైనవాళ్లు రెండేళ్లు ప్రొబేషన్‌లో కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఉద్యోగంలోకి చేరిన మొదటి నెల నుంచే రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సులూ కలుపుకుని ప్రారంభం నుంచే రూ.25 వేలకు తగ్గకుండా వేతనంగా పొందవచ్చు.
ఖాళీల వివరాలు: పోస్టుమ్యాన్ ఖాళీలు విజయవాడ రీజియన్‌లో 106, కర్నూలులో 60, విశాఖపట్నంలో 68 ఉన్నాయి. మెయిల్ గార్డు పోస్టులు విజయవాడ రీజియన్‌లో 6, కర్నూలులో 2, విశాఖపట్నంలో 3 ఉన్నాయి.
అర్హత: పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు రెండు పోస్టులకూ పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
వయసు 18 - 27 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులు: ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
నియామకం: పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.వంద అందరు అభ్యర్థులూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరితేదీ: మార్చి 15 హెడ్ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 16
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20
వెబ్సైట్: www.appost.in, www.indiapost.in
No comments:
Post a Comment